[ad_1]
విడుదల తేదీ : ఏప్రిల్ 11, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి, వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు
దర్శకుడు: వినాయక్ వైద్యనాథన్
నిర్మాత: మీరా విజయ్ ఆంటోని
సంగీత దర్శకుడు: భరత్ ధనశేఖర్
సినిమాటోగ్రఫీ: ఫరూక్ జే బాష
ఎడిటింగ్: విజయ్ ఆంటోనీ
సంబంధిత లింక్స్: ట్రైలర్
విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటిస్తూ, స్వయంగా నిర్మించిన చిత్రమే ‘లవ్ గురు’. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
అరవింద్ (విజయ్ ఆంటోని) ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి మలేషియా నుంచి ఇండియా వస్తాడు. తన జీవితంలో కొన్ని సమస్యలు కారణంగా 35 ఏళ్లు వచ్చినా అరవింద్ పెళ్లికి మాత్రం దూరంగా ఉండిపోయాడు. ఐతే, ఈ 35 ఏళ్ల అరవింద్ తన బంధువుల అమ్మాయి లీల (మృణాళిని రవి) ని చూసి ప్రేమలో పడతాడు. మరోపక్క లీలా మాత్రం తాను పెద్ద హీరోయిన్ కావాలని కలలు కంటూ ప్రయత్నాలు చేస్తుంటుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో లీలా – అరవింద్ పెళ్లి జరుగుతుంది. పెళ్లి తర్వాత వారి జీవితాలు ఎలా మారాయి ?, అసలు అరవింద్ తన జీవితంలో ఏం కోల్పోయాడు ?, అలాగే లీలను హీరోయిన్ గా చేసేందుకు అరవింద్ ఎలాంటి రిస్క్ చేశాడు ?, చివరకు లీల తన భర్తకు చేరువైందా ? లేదా అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పూర్తిగా దూరంగా పెడితే ఆ భర్త మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది ?, తన ప్రేమతో భార్య ప్రేమను దక్కించుకోవడానికి అతను చేసిన ప్రయత్నాలు ఏమిటి.. ఈ మధ్యలో సినిమా మేకింగ్ డ్రామాతో పాటు సిస్టర్ సెంటిమెంట్, భార్యాభర్తల మధ్య ఎమోషన్స్ మరియు కొన్ని కామెడీ సీన్స్ అండ్ డైలాగ్స్.. ఇవ్వన్నీ ఈ లవ్ గురు సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. మొత్తానికి సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ ఆంటోనీ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్ తో మరియు ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా విజయ్ ఆంటోనీ నటన బాగుంది. సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన హీరోయిన్ మృణాళిని రవి కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. హీరోకి మామగా నటించిన సీనియర్ నటుడు వీటీవీ గణేష్ కూడా చాలా బాగా నటించాడు. వీటీవీ గణేష్ డైలాగ్స్ కొన్ని పేలాయి. యోగి బాబు పంచ్ లు అండ్ కామెడీ టైమింగ్ కూడా బాగుంది.
తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవిలతో సహా ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో అరవింద్ పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన సిస్టర్ ట్రాక్.. హీరోయిన్ పాత్రతో ముడి పడిన సీన్స్.. మొత్తానికి ఈ సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి.
మైనస్ పాయింట్స్ :
ఈ లవ్ గురు సినిమా చూసినంత సేపు షారుక్ ఖాన్ ‘రబ్ దే బనా దియా జోడి’ అనే సినిమా కథ గుర్తుకు వస్తూ ఉంటుంది. కథలో సిస్టర్ సెంటిమెంట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినా, కథ కథానాలు మాత్రం రెగ్యులర్ గానే సాగాయి. నిజానికి సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నపటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు వినాయక్ వైద్యనాథన్ కొన్ని చోట్ల తడబడ్డాడు.
అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ అలాగే మంచి ఎంటర్ టైనర్ గా ప్లేని నడపాలి. కానీ, కొన్ని చోట్ల అలా సాగలేదు. అలాగే, హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన ట్రాక్ కు కూడా సరైన బలం లేదు. భార్య కోసం సినిమా ప్రొడ్యూస్ చేసే క్రమంలో వచ్చే సీన్స్ ఇంకా ఎంటర్ టైన్ గా ఉండి ఉంటే బాగుండేది.
సాంకేతిక విభాగం :
టెక్నికల్ గా చూసుకుంటే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా భరత్ ధనశేఖర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా ఫరూక్ జే బాష సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఎడిటర్ గా విజయ్ ఆంటోనీ వర్క్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఐతే, సినిమాలో నిర్మాతగా విజయ్ ఆంటోనీ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.
తీర్పు :
‘లవ్ గురు అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, సినిమా మేకింగ్ డ్రామా, మరియు కామెడీ అండ్ లవ్ సీన్స్ అలరించాయి. అలాగే, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ ముఖ్యంగా సిస్టర్ సెంటిమెంట్ బాగుంది. ఐతే, ఇంట్రెస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు ‘రబ్ దే బనా దియా జోడి’ సినిమా గుర్తుకు రావడం, మెయిన్ క్యారెక్టరైజేషన్స్ బలహీనంగా ఉండటం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ఫ్యామిలీ ప్రేక్షకులకు మాత్రం కనెక్ట్ అవుతుంది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
[ad_2]